అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ : మూడో ప్రపంచ దేశాలు

By Nagaraj  Vallala and Atul Alexander





   

(This is our second vernacular post under the 2021 edition of the JILS Vernacular Publication Initiative, that marks the celebration of the International Mother Language Day. Through this initiative, we at JILS, are attempting to take a small step towards making legal education and information more inclusive and accessible, and countering the stronghold of English in legal academia with publication in vernacular languages.)









సామాజిక ఆర్థికాంశాల దృష్ట్యా సమకాలీన ప్రపంచం ప్రధానంగా మూడు సమూహాలుగా విభజించపడింది. అవి ఏమనగా, మొదటి ప్రపంచ దేశాల సమూహం, రెండవ ప్రపంచ దేశాల సమూహం మరియు మూడవ ప్రపంచ దేశాల సమూహం. మొదటి ప్రపంచ దేశాలు అనగా సామాజికంగా ఆర్థికంగా మానవ నాగరికతలో ముందంజలో ఉన్న దేశాలు. ఉదాహరణ: యూరోప్, ఉత్తర అమెరికా తో కలిపి మరికొన్ని అభివృద్ధి చెందిన క్రైస్తవ దేశాలు. రెండవ ప్రపంచ దేశాలు అనగా మొదటి ప్రపంచ దేశాల అభివృద్ధికి ధీటుగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన వామపక్ష దేశాలు. మూడో ప్రపంచ దేశాలు అనగా ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత కూడా ఇంకా అభివృద్ది చెందుతూ ఉన్న దేశాలు. ఈ మధ్య కాలంలో కొంతమంది సామాజిక ఆర్థిక వేత్తలు మరీ పేద దేశాలను మూడో ప్రపంచ దేశాల నిర్వచనం నుండి వేరుచేసి నాల్గవ ప్రపంచ దేశాలు అనికూడా వ్యాఖ్యానిస్తున్నారు. సమకాలీన నాగరిక యుగంలో మనిషి తనయొక్క జీవన విధానానికి సాధించిన అస్త్రం ప్రజాస్వామిక చట్టం.

రాజ్యం మరియు రాజకీయం లేకుండా మనిషి జీవించలేడు అని అరిస్టాటిల్ చెప్పిన మాటలను బలపరుస్తూ అంతర్జాతీయ చట్టం మరియు అంతర్జాతీయ న్యాయ సూత్రాలు లేకుండా కూడా సమకాలీన ఆధునిక ప్రపంచం మనుగడ సాగించలేదని కూడా ఒక అంతర్జాతీయ చట్ట విద్యార్థిగా ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు అమలులో ఉన్న అంతర్జాతీయ చట్టం మరియు దానియొక్క సూత్రాలు వ్యవస్థలన్నీ కూడా మొదటి ప్రపంచ దేశాలు వాటియొక్క ప్రధాన కర్త గా వ్యవహరిస్తున్న అమెరికా లాంటి దేశాల అభివృద్ధికి, అవి మిగిలిన ప్రపంచ దేశాల మీద చెలాయిస్తున్న రాజకీయ ఆర్థిక ఆధిపత్యానికి అస్త్రం గా మారిందనేది కూడా ప్రతి సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు న్యాయ శాస్త్ర పరిశోధకులు ఒప్పుకోవాల్సిందే. అందుకే ప్రపంచమంతా అంతర్జాతీయ చట్టానికి ఇస్తున్న నిర్వచనాన్ని వ్యతిరేఖిస్తూ చైనా ఐక్యరాజ్యసమితి అమలులోకి వచ్చినప్పటి నుండి విభిన్నమైన నిర్వచనం ఇస్తుంది. అంతర్జాతీయ చట్టం అనగా నాగరిక దేశాలన్నీ కూడా వాటి యొక్క సంబంధాలను న్యాయపరంగా జరుపుకోవడానికి వాటికవి ఏర్పరుచుకున్న సూత్రాల వ్యవస్థ గా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన  అంతర్జాతీయ న్యాయ నిపుణుడు ఓపెన్ హామ్ నిర్వచిస్తే చైనా అంతర్జాతీయ న్యాయ నిపుణులు దానికి భిన్నంగా అంతర్జాతీయ చట్టాన్ని పశ్చిమదేశాలు వాటియొక్క ఆర్థిక దోపిడీకి, పశ్చిమేతర దేశాల రాజకీయ అణచివేతకు ఉపయోగించుకునే సాధనంగా నిర్వచిస్తారు. 

ఒకవైపున ఇదంతా అంతర్జాతీయ చట్టం యొక్క సిద్ధాంతపరమైన చర్చ అయితే రెండోవైపున అంతర్జాతీయ చట్టం యొక్క నిర్మాణాత్మకమైన విధానాన్ని కూడా పరిశీలించాలి. అంతర్జాతీయ చట్టం వివిధ ప్రపంచస్థాయి వ్యవస్థలను క్రమబద్ధీకరిస్తూ ప్రపంచంలోని సకల దేశాల సార్వభౌమధికారాన్ని మరియు వాటియొక్క హక్కుల రక్షణ కోసం ఉద్దేశించపడినదని ప్రతి న్యాయశాస్త్ర విద్యార్థి తన నిత్య పరిశోధనలో గమనించే అతి ముఖ్యమైన విషయం. ఇక్కడ ప్రధానంగా ప్రపంచస్థాయి వ్యవస్థలంటే ఐక్యరాజ్యసమితి మరియు దాని ఆధీనంలో పనిచేసే ప్రపంచ సంస్థలు. మనం ఎప్పుడైనా అంతర్జాతీయ చట్టం గురించి చర్చిస్తే   అంతర్జాతీయ సంబంధాలు మరియు రాజకీయల గురించి కూడా చర్చించాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాన్ని అంతర్జాతీయ సంబంధాలు మరియు రాజకీయాలనుండి వేరుచేయలేం. ప్రపంచ రాజకీయాలు ఏ పరిస్థితులలోనైన అంతర్జాతీయ సంబంధాలను మరియు అంతర్జాతీయ చట్టాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రపంచ పరిపాలనకు మూలస్థంభమైన ఐక్యరాజ్యసమితి లో మూడో ప్రపంచ దేశాల పాత్రను ఒకసారి సవివరంగా వివరించి ఈ వ్యాసాన్ని ముగిస్తా. ఐక్యరాజ్యసమితి లో ప్రధానంఘమైన రక్షణ మండలిని సామ్రాజ్యావాద వలస దేశాల మండలిగా అభివర్ణించవచ్చు. రక్షణ మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా చెలామణిలో ఉన్న ఐదు దేశాలలో చైనా తప్ప మిగతా నాలుగు దేశాలు  మూడో ప్రపంచ దేశాలను ఆర్థికంగా కొల్లగొట్టిన సామ్రాజ్యవాద దేశాలు.ఆధునిక అంతర్జాతీయ చట్టానికి మూలస్థంభమైన ఐక్యరాజ్యసమితి చార్టర్ రక్షణ మండలిలోని శాశ్వత సభ్య దేశాలకు ఆమోదించిన వీటో అధికారాన్ని మొదటి ప్రపంచ దేశాలు వాటి యొక్క ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి మరియు మిగిలిన ప్రపంచం మీద తమ ఆధిపత్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయోగిస్తున్నాయనేది కాదనలేని సత్యం. మూడో ప్రపంచ దేశాల ప్రపంచ స్థాయి సమస్యల ఎజెండాను రక్షణ మండలి దృష్టికి తీసుకువచ్చే హక్కు మూడో ప్రపంచ దేశాలకు లేనప్పుడు ఈ సమకాలీన అంతర్జాతీయ చట్టం అప్రజాస్వామికమైన లక్షణాలను కలిగి ఉందనేది కూడా కాదనలేని సత్యం.

ముగింపు

ప్రస్తుతం అమలులో ఉన్న ఆధునిక అంతర్జాతీయ న్యాయ వ్యవస్థ కి పునాది 1945 అక్టోబర్ 24 వ తేదీన అమలులోకి వచ్చిన ఐక్యరాజ్యసమితి చార్టర్. ప్రతి అంతర్జాతీయ న్యాయశాస్త్ర పరిశోధకుడు గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, అంతర్జాతీయ శాంతి మరియు రక్షణ కోసం ఏర్పడ్డ ఈ ఐక్యరాజ్యసమితి చార్టర్ ఏర్పరచిన రక్షణ మండలి ప్రపంచ పాలన మండలిగా అవతరించి అంతర్జాతీయ బాధ్యతలు మొత్తం కూడా అయిదు దేశాలకు అప్పగించిందనేది. మనం పైన చర్చించుకున్నట్టు, అంతర్జాతీయ చట్టాన్ని, సంబంధాలను మరియు అంతర్జాతీయ రాజకీయాలను వేరు చేయలేము. ఎప్పుడైతే అంతర్జాతీయ చట్టాలను అంతర్జాతీయ రాజకీయాల నుంచి వేరు చేస్తామో ప్రపంచ మానవాళి యొక్క పలు సమస్యల పరిష్కారంలో న్యాయబద్ధత లోపిస్తుందనేది కూడా ప్రతి అంతర్జాతీయ విశ్లేషకుడు గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం.కావున మూడో ప్రపంచ దేశాల నాయకత్వం మరియు మూడో ప్రపంచ దేశాల అంతర్జాతీయ చట్ట నిపుణులు ఆధునిక అంతర్జాతీయ సామాజిక, రాజకీయ, ఆర్థిక మరియు న్యాయ సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఐక్యరాజ్యసమితి రక్షణ మండలి యొక్క సంస్కరణ కోసం ఒక నూతన సంస్కరణోద్యమం ప్రారంభించాలి. మానవ సమ్మిళిత ప్రపంచానికి చిహ్నంగా మారిన జనరల్ అసెంబ్లీ కి ఐక్యరాజ్యసమితి చార్టర్ అందించిన అధికారాలు మరియు బాధ్యతలు రక్షణ మండలి యొక్క అధికారాలు భాధ్యతలతో ఘర్షణ పడుతున్న విధానాన్ని ఇండియా లాంటి మూడో ప్రపంచ దేశాలు లేవనెత్తాల్సిన అవసరం రోజు రోజుకు బలపడుతుంది. ప్రధానంగా మూడవ ప్రపంచ దేశాలు బ్రేట్టన్ వుడ్స్ సంస్థలు అయిన ప్రపంచ బ్యాంకు మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లాంటి సంస్థలు అనుభవిస్తున్న పలు అధికారాల మీద అంతర్జాతీయ న్యాయ సూత్రాల పరిధిలో మరో నూతన అంతర్జాతీయ ఆర్థిక, శాంతి మరియు రక్షణ విధానాన్ని ప్రవేశ పెట్టడం కోసం పాటుపడాల్సిన సమయం ఎంతో దూరం లేదని ఒక అంతర్జాతీయ న్యాయ శాస్త్ర విద్యార్థిగా చాలా గాఢంగా విశ్వషిస్తున్న.

About the authors

Mr. Nagaraj Valla is a practicing advocate and Mr. Atul Alexander is an Assistant Professor of Law at the WB National University of Juridical Sciences (NUJS), Kolkata.

Leave a comment